ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి ఎంపికయ్యారు. విజయవాడలో శనివారం రాత్రి జరిగిన పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, కొప్పుల రాజు, జేడీ శీలం పాల్గొన్నారు. ఆస్తుల పరిరక్షణ కమిటీకి చేవూరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చేవూరు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు.