రాష్ట్ర ప్రభుత్వం కి పర్యావరణ పరిరక్షణ పట్టడం లేదని ప్రముఖ పర్యావరణవేత్త, ‘వాటర్మన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన డాక్టర్ రాజేంద్రసింగ్ విమర్శించారు. రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వచ్చేముందు తాను రుషికొండ ఎదురుగాఉన్న ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని చెప్పారు. అక్కడి నుంచి రుషికొండపై జరుగుతున్న విధ్వంసాన్ని చూశానన్నారు. రాష్ట్ర పాలకులకు సరైన బుద్ధి కల్పించాలని, కోర్టు త్వరగా వీళ్లను శిక్షించి, రుషికొండ ప్రాంతాన్ని రక్షించాలని భగవంతుడిని కోరుకున్నట్టు తెలిపారు. సముద్రం మనిషికి జన్మనిచ్చిన తల్లి లాంటిదని, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మంచిది కాదని హితవుపలికారు. గత ప్రభుత్వ తప్పిదాలను వేలేత్తి చూపిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక తానూ అదే తప్పు చేయడం సరికాదన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.