ఆన్ లైన్ లో లడ్డు పొందుచ్చు అన్న ప్రచారానికి టీటీడీ తెరదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్‌సైట్ ద్వారా లడ్డూలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని.. భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే, తిరుమల శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.
మరోవైపు తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉడిపి బండారు కెరీ మఠం పీఠాధిపతి విద్యదీస్య తీర్థ స్వామీజీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికర్జిన్, కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.