మాండూస్ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందు.. కృష్ణా జిల్లాలోని కూచిపూడి, మొవ్వ గ్రామాల్లో పర్యటించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాండొస్ తుఫాను బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాండొస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలోని గన్నవరం, అవనిగడ్డలో పంట నష్టం ఎక్కువగా ఉంది. సుమారు 10 నుంచి 12 వేల ఎకరాల్లో రైతులు వరి పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అధికారులు. గోనె సంచుల కొరత కారణంగా.. రోడ్డుపైనే తడిసిన వరి ధాన్యం ఉండిపోయింది. అవనిగడ్డలో వరి పంటతో పాటు.. టమాట, క్యాబేజీ, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు.
అటు మాండొస్ తుఫాన్ బాధితులకు జగన్ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయాన్ని బాధితులకు ఇవ్వనున్నారు. మాండూస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.