‘‘వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చింది. దళితులను కిరాతకంగా హత్య చేసిన వారికి సీఎం జగన్‌రెడ్డి అండదండలు లభిస్తున్నాయి. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన పెద్ద మనిషి తానేం చేసినా వారు పడి ఉంటారని భావిస్తున్నారు’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తన డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం అనే దళితుడిని అనంత బాబు కిరాతకంగా చంపడమే కాకుండా శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుపై గతంలో రౌడీ షీట్ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారు. తొంభై రోజుల్లో వేయాల్సిన చార్జిషీటు దాఖలు చేయకుండా అతనికి బెయిల్ వచ్చేలా చేయడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేసింది. కోర్టుకు ఇచ్చిన కేస్ డైరీలో కూడా అతని పాత కేసులు ఏవీ చూపించకుండా మరుగుపర్చారు. ప్రభుత్వ సహకారం లేకుంటే అతనికి ఇప్పుడు బెయిల్ వచ్చేది కాదు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ప్రభుత్వం ఇదే తరహా నాటకం ఆడింది. పాము తన పిల్లలను తాను తిన్నట్లు సీఎం జగన్‌రెడ్డి... తనకు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన దళితులనే కాటు వేస్తున్నాడు’’ అని విమర్శించారు. దళిత, ప్రజా సంఘాలతో మాట్లాడి అనంతబాబుకు ఇచ్చిన బెయిల్‌పై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.