మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2019లో తీర్మానం చేసిన దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ..... ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠినశిక్షల నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటును బిల్లులో పొందుపరిచారని తెలిపారు. సమర్థమైన న్యాయబట్వాడా వ్యవస్థ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని, ఈ మేరకు దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని కోరారు. బిల్లు హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.