వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడమే మన టార్గెట్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మైలవరం నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకు చాలా టైమ్ ఉంది కదా అని అనుకోవద్దు. గడప గడపకూ కార్యక్రమంతో ప్రజలవైపు అడుగులు వేగంగా వేస్తున్నాం. ఆ అడుగులు చూస్తే, ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మైలవరం నియోజకవర్గంలో సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగింది. వివిధ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు రూ.900 కోట్ల నగదు నియోజకవర్గంలోని ఇళ్లకు చేరింది. ప్రతి ఇంట్లో ఎంతెంత మేలు జరిగిందన్న పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలన్న గొప్ప కార్యక్రమం. ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయి ఉంటే, వారిని వదిలేయకుండా మంచి చేయడం కోసం కూడా గడప గడపకూ కార్యక్రమం అని అయన తెలిపారు.