చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన కొండాల ఎర్రన్నాయుడు (27) మూడు నెలల క్రితం చెన్నైలో తాపీ పని చేసేందుకు వెళ్లాడు. 20 రోజుల క్రితం అక్కడ ఆటోలో ప్రయాణం చేస్తుండగా వాహనం బోల్తా పడింది. ఘటనలో గాయపడిన ఈయన ప్రథమ చికిత్స తీసుకొని చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఎర్రన్నాయుడును కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చేతికి అందొచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.