పాకిస్ధాన్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం విజయవాడలో బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. సిటీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పాకిస్ధాన్ మంత్రి బిలావల్ భుట్టో న్యూయార్క్‌లో దేశంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిన్‌లాడెన్ చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని బుట్టో వ్యాఖ్యలను దేశం హర్షించదన్నారు. పాకిస్ధాన్‌కు చెందిన వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని లేకుంటే పాకిస్ధాన్ గుండెల్లో భారత్ నిద్రపోతుందని హెచ్చరించారు. పాక్ భూ భాగంలోకి వచ్చి దాడులు నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మోదీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భారత జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు పాకిస్తాన్‌పైన దాడి చేస్తే తోక ముడిచారని సోమవీర్రాజు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.