సంక్రాంతికి కోడి పందేలు జరుగుతాయో లేదో గాని ఇప్పటి నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలోని లాడ్జిలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోడి పందేలతో పాటు జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలను తిలకించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. పండుగ మూడు రోజులు ఈ ప్రాంతంలో సంతోషంగా గడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వీరితో పాటు పందెం రాయుళ్లు కాయరాజాకాయ్ అంటూ ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు. వీరంతా అడ్వాన్స్‌గా రూమ్‌లు బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నరసాపురం , పాలకొల్లు , భీమవరం , తణుకు , టీపీగూడెం ప్రాంతాల్లోని లాడ్జిలకు ముందుగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు గదుల ధరల్ని రెట్టింపు చేశారు. సాధారణ రోజుల్లో ఉండే ధరను పెంచేశారు. లాడ్జి స్థాయి బట్టి ధర ఫిక్స్ చేశారు. రూ. 3 వేలు ఉండే డీలక్స్ రూమ్‌ను రూ.6 వేలు చెబుతున్నారు. సింగల్ రూమ్ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచారు. ఫోన్ చేసి రూమ్ గురించి అడిగితే ధరలు చెప్పి అడ్వాన్స్ ఇస్తేనే బుక్ చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. అది కూడా పండుగ మూడు రోజులపాటు రూమ్ బుక్ చేసుకోవాల్సిం దేనంటున్నారు. ముందుగా మూడు రోజులు బుక్ చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రోజైతే మళ్లీ ఫోన్ చేయండి చూసి చెబుతామంటూ దాటేస్తున్నారు.