గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష కోసం నెలనెలా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్‌లతో నిర్వహించే సమీక్షా సమావేశాన్ని 76 రోజుల తర్వాత శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించారు. ఎప్పటిలాగే మరొకరికి అవకాశం ఇవ్వ కుండా ఆరంభం నుంచి చివర వరకు మాట్లాడే సీఎం జగన్ ఈసారి కూడా అలానే చేశారు. తొలుత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు వచ్చే ఏప్రిల్ నాటికి మీ జాతకచక్రంపై ప్రత్యేక నివేదికలు తె ప్పిస్తానని స్పష్టం చేశారు. మీ పనితీరు, లోపాలు, ప్రజల్లో, కేడర్‌లో మీకున్న బలాలేంటో తేట తెల్లమవుతాయి.. తదనుగుణంగా బరిలో ఉండేదెవరో పోయేదెవరో అప్పుడే తేల్చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గడపగడపకులో ముందు ఎవరు ఉన్నారు, వెనకెవరు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావించారు. గడచిన 76 రోజు ల్లో 20 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించని జాబితాలో మంత్రి సురేష్‌తో పాటు ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మీరు కనీసం 20రోజులు కూడా తిరగలేదు. ఇలాగైతే ఇబ్బందిపడతారని హెచ్చరించారు. ఎక్కువ రోజులు పాల్గొన్న వారి పేర్లు నూ ప్రకటించారు. అందులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పర్చూరు ఇన్‌చార్జ్ రావి రామనాథంబాబు నిలిచారు. బాగా తిరుగుతున్న వారిని అభినందిస్తూనే, తిరగని వారు రానున్న మూడు నాలుగు నెలల్లో పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో మీరే నష్టపోతారు, మళ్లీ అసెంబ్లీలో కి అడుగుపెట్టలేరని సూటిగా చెప్పారు.