వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. పవన్ కల్యాణ్ సమక్షంలో.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ మొదటి నుంచి వైసీపీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. కష్టపడిన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, జైలుకు పంపుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మూడున్నరేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యానేరం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిందని, కానీ కోడి కత్తి నిందితుడు అయిన దళిత యువకుడికి మాత్రం ఇప్పటివరకు బెయిల్ రాలేదని, ఇంకా జైలులో మగ్గిపోతున్నాడన్నారు. ఇది కేవలం ప్రభుత్వ పక్షపాతమేనని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరానని, ఆయన ఆదేశానుసారం నడుచుకుంటానని బొంతు రాజేశ్వరరావు స్పష్టం చేశారు.