రాష్ట్రంలో జగన్ రెడ్డి అండ్ కో అరాచకాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రతిపక్ష కార్యక్రమాలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి మారుమూల పల్లెల వరకు పులివెందుల ఫ్యాక్షనిజం వైరస్‌లా సోకిందన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రతనిచ్చామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో టీడీపీ కార్యక్రమాలు, కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. టీడీపీ జెండా కట్టుకున్నాడని గోపాల్ అనే అతని ఆటోను తగులబెట్టడం దుర్మార్గమన్నారు. తెనాలిలో అన్న క్యాంటీన్‌ను వైసీపీ గూండాలు తగులబెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టారని మండిపడ్డారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని వాళ్లకు తగులబెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి గద్దె దిగితేనే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.