వైసీపీ, టీడీపీ గూండాల నుంచి ఏపీని కాపాడాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈరోజు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నిరూపితమైందన్నారు. వైసీపీ గూండాలు, టీడీపీ గూండాల మధ్య దాడులు, హత్యలు జరుగుతున్నాయని అని అన్నారు. పలు జిల్లాల్లో తన పర్యటనలో వందలాది మంది తనను కలిశారని, ఇప్పుడు బుద్ది వచ్చిందని చెబుతున్నారని వెల్లడించారు. 2014లో చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ లాగా, ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తానని చెప్పారని, అయితే సీమాంధ్రను చీమల ఆంధ్రాగా, ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చారని కేఏ పాల్ విమర్శించారు. రాజధాని అమరావతిలో రైతుల నుంచి చవకగా దోచుకున్న రూ.3 లక్షల కోట్ల ఆస్తులను కాపాడేందుకు చంద్రబాబు, లోకేష్, టీడీపీ గూండాలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై సీఎం జగన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అక్రమ మార్గాల్లో దాడులు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.