అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి రాష్ట్రంలో ఆడ బిడ్డలను మోసం చేశాడని, ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కట్టక పోగా గతంలో టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా కావాలనే జాప్యం చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో 25, 26 వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రాని కి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.... నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి ఇక్కడ మంత్రి పని తీరుకు నిదర్శనమని మునిసిపాలిటీ పరిధిలో శానిటేషన్ లేదు, ఒక్క రోడ్డు వేయలేదు, మంచినీటి సమస్య పరిష్కరించలేకపోయారని అన్నారు. టీడీపీ హయాంలో 95 శాతం నిర్మాణం పూర్తయినా 6,500 టిడ్కో గృహాలను మిగిలిన ఐదు శాతం పూర్తి చేయటానికి ఇక్కడ ఉన్న మంత్రి మూడున్నర సంవత్సరాలు తీసుకున్నా పనులు పూర్తి చేయటం చేతకాలేదన్నారు. మద్యం షాపులన్నీ మంత్రి కుటుంబ సభ్యులవేనని, ఇక్కడ అమ్ముతున్న మద్యం ధరలు రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు.