అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం అమ్మకాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవడానికి సిద్ధమైంది.ఇప్పటివరకు 14సార్లు నిర్వహించిన టెండర్ల ద్వారా 1400టన్నుల ఎర్రచందనం విక్రయించగలిగింది.వీటి ద్వారా రూ.1850 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభించింది.తిరుపతిలోని కరకంబాడి వద్ద ఉన్న ఎర్రచందనం సెంట్రల్ గోడౌన్‌లో 5600 టన్నులు అమ్మకానికి సిద్ధంగా ఉంది. కపిలతీర్థం వద్ద ఉన్న గోడౌన్‌లో మరో 100 ఎర్రచందనం టన్నులు వుంది. వీటిని కూడా గ్రేడ్ల వారీగా విభజించి సెంట్రల్ గోడౌన్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎ,బి,సి గ్రేడ్లు ఉన్నాయి. గ్లోబల్ టెండర్లలో పాల్గొనేవారు గోడౌన్‌ను సందర్శించి అందులో ఉన్న ఎర్రచందనాన్ని పరిశీలించి ఇష్టమైన రకాన్ని ఎంపిక చేసుకుంటారు. చైనా, జర్మనీ, హాంకాంగ్, దుబాయ్, సింగపూర్ దేశాలకు చెందిన కాంట్రాక్టర్లు కూడా ఈ టెండర్లలో పాల్గొంటుండడం గమనార్హం. గతంలో జరిగిన టెండర్ ప్రక్రియలో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా కూడా పాల్గొని ఎర్రచందనాన్ని కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన ఎర్రచందనాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.