మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని హత్య చేసేందుకు వైసీపీ నేతలు పన్నిన కుట్రకు పోలీసుల సహకారం కూడా ఉంది అని టీడీపీ బృందం ఆరోపించింది. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, జీవీఎస్ ఆంజనేయులు తదితరులతో కూడిన ఈ బృందం ఆదివారం గుంటూరులో రేంజి డిఐజీ సీఎం త్రివిక్రమ వర్మ, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిలను కలిసింది. మాచర్లలో హింసాత్మక ఘటనలు, టీడీపీ శ్రేణులపై దాడులు, పోలీసుల ఏకపక్ష వైఖరి, బ్రహ్మారెడ్డి సహా 9మందిపై హత్యాయత్నం కేసులు బనాయింపు వంటి అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చింది. తమ నేతలు, కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరింది.