టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు వైద్యులు చంద్రమౌళిరెడ్డి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. 18వ తేదీన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డాక్టర్లు ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతో ఎక్మోపై చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అత్యంత క్లిష్ట సమయంలో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. హార్ట్ అటాక్ రావడంతో చంద్రమౌళి రెడ్డిని బంధువులు కావేరీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వెంటిలేటర్ పెట్టి వైద్యులు చికిత్స అందించారు. అయినా కూడా పరిస్థితి విషమించడంతో ఎక్మోపై చికిత్సను ప్రారంభించారు. ఈ నెల 26న చంద్రమౌళిరెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే ఆయన తన పెళ్లి ఆహ్వాన పత్రికలను అందించేందుకు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనకు గుండె నొప్పి రావడంతో బంధువులు చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుమారుడి పరిస్థితి చూసి ధర్మారెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. ఆయనకు వైద్యులు చికిత్సను అందించడంతో కోలుకున్నారు.