రాజకీయాల కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రైతులను ఆదుకోలేదని, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడానికి ఆదుకుంటున్నారని ఆ పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ..... ‘‘జనసేన ప్రజల కోసమే పనిచేస్తుంది. 280 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ మాటలకు మంత్రి అంబటి రాంబాబు వక్రభాష్యాలు చెప్పడం విడ్డురంగా ఉంది. మంత్రిగా ఉండి ప్రజల కోసం అంబటి ఏం చేశారో చెప్పాలి. పల్నాడులో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి దోచుకోవడం దాచుకోడం చేస్తున్నారు. జగన్ పంపిన పేపర్ చదవడం అంబటికి అలవాటు. జలవనరుల శాఖ మంత్రిగా ఉండి రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు రాష్ట్రం వైపు చూడటానికి భయపడుతుంది. పోలవరం ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమా? సీఎం స్వయంగా సమీక్ష పెట్టి.. దోచుకున్నది చాలు ప్రజలకు సేవ చేయండి అని చెప్పడం సిగ్గుచేటు. ప్రభుత్వం విక్రయించే చీఫ్ లిక్కర్‌పై దేవుడి పేర్లు పెట్టిన మారు వారాహి వాహనం పై విమర్శలు సిగ్గు చేటు.’’ అని దుయ్యబట్టారు.