ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. సోమవారం సింహాద్రిపురం మండలంలోని బిదినం చర్ల గ్రామంలో నాడు నేడు నిధులతో సుమారు రూ. 1. 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రతి గ్రామంలో 104 సేవలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీలో కొత్తగా మరికొన్ని వ్యాధులను చేర్చి చికిత్స అందజేస్తున్నారన్నారు. ప్రతి నిరుపేదకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనేదే లక్ష్యంతో ప్రభుత్వం ఆత్యాధునిక వసతులతో నూతన భవనం ఏర్పాటు చేసిందన్నారు.