రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో జిల్లా పర్యటనలో హంద్రీ నీవా కాలువ విషయంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ విమర్శించారు. మంగళవారం స్థానిక బిటి. పక్కీరప్ప భవానంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ గత ఐదేళ్ల క్రితం సిఎం జగన్మో హన్ రెడ్డి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేసినపుడు రాప్తాడు బహి రంగ సభలో హంద్రీ-నీవా కాలువ ద్వారా జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పాడని ఎద్దేవా చేశారు. అదేవిధంగా హంద్రీ-నీవా కాలువను వెడల్పు చేసి మల్లియాల నుండి జీడిపల్లి వరకు పదివేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచుతామని బహిరంగ సభలో హామీ ఇచ్చారన్నారు. తుంగ భద్ర హెచ్. ఎల్. సి కాలువ ఆధునీక రణ ఏడాదిలో పూర్తి చేస్తామని నమ్మ బలికాడన్నారు. అధికారం చేపట్టి ముడున్నరేళ్లు గడుస్తున్నా జిల్లా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయక మాట తప్పాడని విమర్శించారు. సిఎం జగన్ రెడ్డి మాట తప్పినందుకు నిరసనగా ఈ నెల 21న అనంతపురం జిల్లా ప్రజలను వంచించిన దినోత్సవం గా సిపిఐ పార్టీ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.