కేంద్రం వివిధ రకాల నేరాలు, అంశాలపై నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకు రుణాల ఎగవేతదారులలో టాప్ 50 మంది చెల్లించాల్సిన మొత్తం రూ.92,570 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ పేర్కొన్నారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఇక ఎగవేతదారుల్లో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడని చెప్పారు. ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు.
ఛోక్సీ తర్వాతి స్థానంలో ఎరా ఇన్ ఫ్రా (రూ.5,879 కోట్లు), రెయిగో ఆగ్రో (రూ.4,803 కోట్లు), కాంకాస్ట్ స్టీల్ (రూ.4,596 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.3,708 కోట్లు) తదితర కంపెనీలు ఉన్నాయని కేంద్ర మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం ఈ అప్పుల వివరాలను వెల్లడించినట్లు మంత్రి వివరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని బ్యాంకుల గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్ పీఏ) రూ.3 లక్షల కోట్లకు తగ్గాయని మంత్రి చెప్పారు. గతంలో ఈ మొత్తం రూ.8.9 లక్షల కోట్ల దాకా ఉండేదని వివరించారు.