విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస, ఏజెన్సీ పంచాయతీ టీకే జమ్ము పరిధి చినదోడిజ గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పంట పొలాల్లో వరి చేలు నూర్పులు చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ ప్రాంతానికి చెందిన హిమరిక పండయ్య, నిమ్మక గంగరాజులకు చెందిన ఎకరన్నర వరి చేను, నూర్పు యంత్రం దగ్ధమయ్యాయి. సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు గుమ్మలక్ష్మీపురం అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నూర్పు యంత్రం నుంచి వచ్చిన మంటలే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యనారాయణ తెలిపారు. కాగా నష్టపోయిన తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.