రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందని, హక్కులు కాపాడుకునేందుకు రాష్ట్రాలు సమష్టిగా పోరాడవలసిన అవసరముందని కేరళ స్థానిక పాలన, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు మాకినేని బసవపున్నయ్య 108వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకె)లో సోమవారం రాత్రి ‘రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి’అనే అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. కార్యక్రమానికి ఎంబీవీకె మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్, మాజీ ఎంపీ పి.మధు అధ్యక్షత వహించారు. మాకినేని జయంతిని పురస్కరించుకుని ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ..... దేశం లో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ అందించిన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మాకినేని అన్నారు. మోదీ హయాంలో రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతోందన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం సహా అన్ని మూల సూత్రాలు దెబ్బతీసే పని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలని ఆశిస్తూ రాష్ట్రాల హక్కులు కొల్లగొట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. పి.మధు మాట్లాడుతూ జాతీయోద్యమంలో బసవపున్నయ్యది కీలక పాత్ర అన్నారు. ఏడాది కాలంలో ఎంబీవీకె చేపట్టిన కార్యక్రమాల నివేదికను ఎంబీవీకె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ ప్రవేశపెట్టారు.