ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల్లోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.45 లక్షల విలువ చేసే 445 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి గురువారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఉదయం రూరల్ సీఐ దుర్గా ప్రసాద్, పెదపాడు ఎస్‌ఐ, సిబ్బంది తదితరులు ఆశ్రం ఆసుపత్రి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఒక లారీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం లారీలో నలుగురు యువకులు ఉండగా ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరార య్యారు. తమిళనాడుకు చెందిన పాండియన్, అదే రాష్ట్రానికి చెందిన కాళిదాసు, గౌతం, విశాఖపట్టణానికి చెందిన ధనురైలను గంజాయి తరలిస్తున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా నుంచి 445 కిలో గంజాయిని 15 బస్తాల్లో నింపుకుని తమిళనాడు కొడైకెనాల్‌కు చెందిన గౌతంకు ఇచ్చేందుకు తీసుకు వెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. దీంతో పాండియన్, గౌతంలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాళిదాసు, ధనురైలను అరెస్టు చేయాల్సి ఉంది. లారీని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ దుర్గా ప్రసాద్, పెదపాడు ఎస్‌ఐ నాగబాబు, రూరల్ ఎస్‌ఐ లక్ష్మణబాబు, సిబ్బంది పాల్గొన్నారు.