మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విస్తృతంగా పర్యటించారు. తొలుత ప్రకాష్ నగర్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం యర్రబాలెం చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 10వ తేదీన సచివాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో గ్రావెల్ ఫిల్లింగ్ చేయడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం సచివాలయం సమీపంలోని నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని పరిశీలించారు. ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన కంపచెట్లను తొలగించి గ్రావెల్ ఫిల్లింగ్ చేయడంతో పాటు చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సిమెంటు బల్లలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి పార్కు తరహా తీర్చిదిద్దితే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే నవులూరుకు చేరుకుని పలు అభివృద్ధి పనులను, రహదారుల నిర్మాణం పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్, వైసీపీ నాయకులు ఈదులమూడి డేవిడ్ రాజు, బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, గుండాల శ్రీనివాసరావు, పలగాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.