సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మంచికి చెడుకి గూగుల్లో పరిశోధన చేయడం అలవాటుగా మారింది. నేడు ఏది కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న క్రమంలో కావాల్సిన ప్రతి విషయాన్ని గూగుల్ నుంచి తెలుసుకుంటున్నారు. అయితే, గూగుల్ లో ఏది పడితే అది వెతికేయడం మంచిది కాదు. ముఖ్యంగా చట్టవ్యతిరేకమైన అంశాల గురించి సెర్చ్ చేస్తే పోలీసులు మీ ఇంటి వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. గూగుల్ సెర్చ్ అనే కాదు.. ఈ తరహా సమాచారం, అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించొచ్చు.
బాంబు ఎలా తయారు చేయాలి, ప్రెషర్ కుక్కర్ బాంబు ఎలా తయారు చేయాలనే అంశాలను సెర్చ్ చేయకూడదు. ఇతరులకు హాని, ప్రమాదం కలిగించే విషయాల గురించి సెర్చ్ చేసినప్పుడు సెర్చింజన్ సిబ్బందికి, దర్యాప్తు ఏజెన్సీలకు సమాచారం వెళుతుంది. దీనిపై సైబర్ నిఘా ఉంటుందని మర్చిపోవద్దు.
పిల్లల లైంగిక చర్యల గురించి, చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్చ్ చేయడం, అందుకు సంబంధించిన కంటెంట్ చూడడం నేరం. ఈ విధమైన సమాచారం కోసం సెర్చ్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఘటనలు జరిగాయి.
ఆయుధాన్ని ఎలా తయారు చేయాలి? ఆయుధాలు ఎక్కడ లభిస్తాయి? ఏ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి? బుల్లెట్లు ఎక్కడ లభిస్తాయి తదితర సమాచారం తెలుసుకోవడం కూడా చిక్కులు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఆయుధ లైసెన్స్ ఉన్న వారు ఇలాంటి సమాచారం వెతికితే అందుకు కారణం చెప్పొచ్చు. ఇతరులకు ఈ విషయంలో చెప్పి, తప్పించుకోవడానికి కారణాలు ఏమీ ఉండవు.
గర్భస్రావం సంబంధిత సమాచారం గురించి ఎక్కువగా శోధించినా అది నిఘా సంస్థలకు తెలుస్తుంది. గర్భస్రావానికి మన దేశంలో చట్టరీత్యా నిర్దిష్టమైన నియమ నిబంధనలున్నాయి. అందుకని, అనైతికమైన, సురక్షితం కాని, చట్టవ్యతిరేక గర్భస్రావ పద్ధతుల కోసం గూగుల్ లో వెతకడం చిక్కులు తెచ్చి పెడుతుంది.