శ్రీరామనవమి మరుసటిరోజు భద్రాచలంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేకానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ ఏడాది శ్రీరామనవమి తరువాత ప్రత్యేకంగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు దేవస్థానం వైదిక పరిపాలన అధికారులు కసరత్తు ప్రారంభించారు. భద్రాద్రి చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు నెలరోజుల క్రితమే దేవస్థానం వైదిక సిబ్బంది కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, ఆలోచనలు ఇప్పటికే దేవస్థానం ఈవో బి. శివాజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ పట్టాభిషేకోత్సవానికి గవర్నర్ తమిళిసై రానున్నారు. ప్రతి నెల శ్రీమద్రారామాయణ పారాయణం పూర్తయిన సందర్భంగా 27రోజులకు ఒకసారి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే శ్రీరామనవమి మరుసటిరోజు మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. అలాగే 60ఏళ్లకోసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారు. చివరిసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని 1987లో నిర్వహించగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీసమేతంగా పాల్గొన్నారు. అయితే మహాసామ్రాజ్య పట్టభిషేకాన్ని 60 ఏళ్లకోసారి నిర్వహిస్తుండడం వల్ల భక్తుల సౌకర్యార్థం రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 1999, 2011 పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. 2023లో మళ్లీ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.