కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దారుణమని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి విమర్శించారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. అంతకు ముందు తెదేపా కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల పట్టీలను కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తెచ్చిన జీఓ నంబరు ఒకటి కాపీలను దహనం చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఉన్న చీకటి జీఓ వెంటను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంబాపురం రమణారెడ్డి, సయ్యద్, పొన్నతోట శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.