వైద్య రంగంలో మెరుగైన నైపుణ్యత అభివృద్ధికి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం , వైద్య విద్య శాఖా మరియు జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని అన్నారు. శుక్రవారం నోవొటెల్ హోటల్ నందు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం (ఎఎపిఐ) 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కార్యక్రమం విశాఖపట్నంలో ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో వైద్య రంగంలో ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు. శాస్త్రీయ పరిశోధన ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. వైద్యుల సేవా దృక్పథం, అంకితభావం దేశ, ప్రపంచ అభివృద్ధికి పడుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఉత్తమ పాలసీలు అమలు చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలక నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో ఉత్తర సేవల కొరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. 10, 032 వైయస్సార్ విలేజ్ క్లినిక్లు , 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు నెల కొల్పడం జరిగిందని అన్నారు. టెలి మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర భాగాన ఉందని తెలిపారు. ప్రతిరోజు 66 వేల టెలి కన్సల్టేషన్ కాల్స్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు మొత్తం 2. 65 కోట్ల టెలి మెడిసిన్ కాల్స్ సేవలు అందించడం జరిగింది అని తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం దేశంలో మొట్ట మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అదే విధంగా వైద్య సేవలో మరో ముందడుగు వేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున మాట్లాడుతూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రెసిడెంట్ ఆపి డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ తెలుగువాడిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతగానో ఆనందంగా ఉందని అన్నారు. అమెరికా నుండి కనీసం 100 మంది ప్రతినిధులతో ప్రపంచం నలుమూలల నుండి 350 మంది వైద్యులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం అవగాహన, ఆత్మహత్యల నివారణ, మాతాశిశు మరణాలు, పోషకాహారం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, మా నిరంతర వైద్య విద్యా కార్యక్రమం మరియు శిఖరాగ్ర సదస్సులో నిర్వహించబడిన వివిధ ఫోరమ్‌లలో ఆరోగ్య సంరక్షణ సమస్యలను సమగ్రంగా చర్చించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముందుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, డా. సౌమ్య స్వామినాథన్ ఎండి , ఎఫ్ ఐ ఎ పి, జిఎస్ నవీన్ కుమార్ , సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ , జె నివాస్, ఆపి చైర్మన్ డాక్టర్ టి. రవిరాజు, డాక్టర్ రాధ రవిరాజు తదితరులు పాల్గొన్నారు.