పుడింగి అంటే అర్థం తెలియని చంద్రబాబా తనను విమర్శించేది? అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను 'పుంగనూరు పుడింగి' అని సంబోధించడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే స్థాయిలో ప్రతిస్పందించారు. మాట్లాడితే తనను పుంగనూరు పుడింగి అంటున్నారని... పుడింగి అంటే అర్థమేమిటో తెలుసా? అని ప్రశ్నించారు. పుడింగి అంటే అర్థం తెలియని చంద్రబాబా తనను విమర్శించేది? అని అన్నారు. పుడింగి అనే ఒక్క మాటతోనే ఆయన కంటే తానే బలవంతుడిని అనే విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతోనే జిల్లాపరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని తెలిపారు.
కాలేజీలో చదువుకునే రోజుల నుంచి కూడా చంద్రబాబుపై తనదే పైచేయి అని పెద్దిరెడ్డి అన్నారు. పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఈసారి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మైనింగ్ లో కమిషన్లు తీసుకుంటున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు విమర్శలను ఆపాలని చెప్పారు.