ఆస్ట్రేలియా దిగ్గజ మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్‌కు అరుదైన గౌరవం లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లోని ప్రవేశ ద్వారం ‘వాక్ ఆఫ్ ఆనర్’ వద్ద బెలిండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ఘనత అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా బెలిండా రికార్డులకెక్కారు. డేమ్ క్వెంటిన్, న్యూ సౌత్‌వేల్స్ ప్రీమియర్ మొమినిక్ పెరోటెట్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇక ఓ మహిళా క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి. బెలిండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2021లో ప్రకటించారు. కాగా, స్టేడియం ఆవరణలో ఇప్పటికే 73 పురుష క్రికెటర్ల విగ్రహాలు ఏర్పాటు చేయగా, ఆ ఎలైట్ లిస్ట్‌లో ఇప్పుడు బెలిండా కూడా చేరింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ విజేత, ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ అయిన బెలిండా క్లార్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అభినందించింది.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా క్లార్క్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. 15 టెస్టుల్లో 45.95 సగటుతో 919 పరుగులు సాధించింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే 47.49 సగటుతో వన్డేల్లో 4,844 పరుగులు చేసింది. అంతేకాదు, మహిళల వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా క్లార్క్ రికార్డులకెక్కింది. జట్టుకు 12 సంవత్సరాలపాటు కెప్టెన్‌గా ఉన్న క్లార్క్ 101 వన్డేలకు సారథ్యం వహించింది. 1997, 2005లో దేశానికి ప్రపంచకప్‌లు అందించిపెట్టింది.