ఇటీవల కాలంలో కొందరు దొంగలు దొంగతనానికి వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెలకొంది. దొంగతనానికి వచ్చిన వారు చడీచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తుంటారు. కానీ, దుకాణంలో చొరబడ్డ ఓ దొంగ వస్తువులను దొంగిలించడమే కాకుండా, డ్యాన్స్ చేశాడు. ఈ సంఘంటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ వ్యక్తి నగదు, ల్యాప్‌టాప్, లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించి డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. బుధవారం ఖనియంధన పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాల్లో చోరీలు జరిగాయి. వికాస్ జైన్ అనే వ్యక్తి తన దుకాణాన్ని మూసివేసి సాయంత్రం వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి దుకాణం తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా ల్యాప్‌టాప్, నగదు, కొన్ని పత్రాలు, ఇతర వస్తువులు కనిపించలేదు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. దొంగతనం తర్వాత నిందితుడు బ్లాక్ ఫుల్ స్లీవ్ టీషర్ట్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. కానీ, షాప్‌లో కెమెరాను గమనించిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డ్యాన్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సదరు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.