ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. మేకపాటి కుటుంబంలో మరో వివాదం కలకలం రేపుతోంది. పద్దెనిమిదేళ్లు రహస్యంగా కాపురం చేసి తమను విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ లేఖ, పాత ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల తనకి కుమారుడే లేడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంపై ఆక్షేపించారు. మరి తానెవ్వరిని అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? అంటూ సూటి ప్రశ్నలు వేశారు. తన తల్లి తరువాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశావంటూ నిలదీశారు. మేకపాటి తనయుడనంటూ శివచరణ్ రెడ్డి పోస్టు చేసిన లేఖ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కుమారుడిగా తనని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. శివచరణ్ రెడ్డి రాసిన బహిరంగ లేఖపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి వరకూ స్పందించలేదు.