పండుగ రోజుల్లో కోడి పందేలు, పేకాట నివారణకు పటిష్ట నిఘా పెట్టి దాడులు చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏలూరు, చింతలపూడి, జంగా రెడ్డిగూడెం, పోలవరం, కైకలూరు, నూజివీడు ఎస్‌ఈబీ, పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈబీ సాధించిన ప్రగతి, నాటు సారా తయారీ, విక్రయాలపై నమోదు చేసిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా పల్లెల్లో ప్రజలు కోడి పందేలు, పేకాటలకు దూరంగా ఉండేలా యువతకు సంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోడి పందేలు, పేకాట నివా రణకు క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో జూద నిర్వహణ చేసిన నిర్వాహకులపై బైండోవర్ కేసు లు నమోదు చేయాలన్నారు. ఎస్‌ఈబీ ఏఎస్పీ ఎన్. సూర్యచంద్ర రావు, సూపరింటెండెంట్ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.