ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను నవరత్నాలకు మళ్లించడంపై హైకోర్టు మండిపడింది. కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని 2003లోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఒక్క రూపాయి మళ్లించినా అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని వ్యాఖ్యానించింది. సంబంధిత అధికారిపై ఎవరైనా నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7000 కోట్లు కేటాయిస్తే, పేద ఎస్సీ యువత స్వయం ఉపాధి కల్పన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటని, నిధులు మొత్తం నవరత్నాలకే మళ్లిస్తే రాష్ట్రంలోని ఎస్సీలు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించింది. కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసివేయడమే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.