స్టేడియంలో బంతి రావాలి గానీ పాములొస్తే...అందుకే అక్కడ పాములు రాకుండా స్ప్రే చేశారు. భారత్-శ్రీలంక మధ్య మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తొలి వన్డే కోసం గువాహటిలోని బరస్పర స్టేడియం సిద్ధమైంది. నిజానికి ఈ స్టేడియం పేరెత్తితే చాలు క్రికెటర్లు, అభిమానులు జడుసుకుంటారు. జరుగుతున్న మ్యాచ్ ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు. దానికి కారణాలు అనేకం. మైదానంలోకి అకస్మాత్తుగా పాము రావొచ్చు. లేదంటే పిచ్‌పై ఒక్కసారిగా నీళ్లు ఊరొచ్చు. ఇలాంటి ఘటనలతో పరువు పోగొట్టుకున్న అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మరోమారు పరువు పోగొట్టుకోకూడదని భావించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
స్టేడియం లోపలికి పాములు రాకుండా స్నేక్ రిపెల్లెంట్స్ (పాము వికర్షకాలు) స్ప్రే చేయించింది. ప్రేక్షకుల రక్తాన్ని దోమలు తాగేయకుండా దోమల మందు స్ప్రే చేయించింది. ఏసీఏ అధ్యక్షుడు తరంగ్ గగోయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో దోమల మందు కొట్టించి, పాములు రాకుండా రిపెల్లెంట్స్ స్ప్రే చేయించినట్టు ఆయన పేర్కొన్నారు. గువాహటి స్టేడియం ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజీత్ సైకియా తెలిపారు.
2020లో భారత్-శ్రీలంక మధ్య ఈ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. పిచ్‌పై మూడు పొరల కవర్లు ఉన్నప్పటికీ నీరు రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. నీటిని తొలగించి పిచ్‌ను ఆరబెట్టేందుకు ఏసీఏ అధికారులు హెయిర్ డ్రయర్లు, స్టీమ్ ఐరన్లు, బ్యాటరీతో పనిచేసే ఫ్యాన్లు ఉపయోగించడం చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత గతేడాది అక్టోబరులో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ పాము మైదానంలోకి రావడంతో మ్యాచ్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలతో అభాసుపాలైన ఏసీఏ ఈసారి అలాంటి ఘటనలకు తావివ్వకూడదని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.