నసీబ్ అంటే ఇలా ఉండాలి అని యూఏఇలోని ఆ భారతీయులను చూసి చెప్పవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసిస్తున్న భారత ప్రవాసుల ఇంట బంగారు పంట పండుతోంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్న భారత ప్రవాసులు కిలోల కొద్దీ బంగారాన్ని బహుమతిగా గెలుచుకుంటున్నారు. డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో షాపింగ్ చేసి లాటరీ కొనుగోలు చేసిన వారిలో 44 మంది విజేతలుగా నిలిచారు. వారికి 11 కిలోల బంగారం బహుమతిగా లభించింది. వీరిలో 27 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వీరందరూ ఒక్కొక్కరు పావు కిలో చొప్పున స్వర్ణం గెలుచుకున్నారు.
ఈనెల 29వ తేదీ వరకు షాపింగ్ ఫెస్టివల్ ఉండటంతో మరింత మంది బంగారాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ గోల్డ్ లక్కీ డ్రాలో పేరు నమోదు చేసుకొని బంగారం గెలుచుకోవాలనుకునేవాళ్లు షాపింగ్ ఫెస్టివల్ లో 500 దిర్హమ్స్ (రూ.11వేలు), అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు వాళ్లు గోల్డ్ లాటరీకి అర్హులు అవుతారు. కాగా, 46 రోజుల పాటు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో అద్భుతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తోంది. షాపింగ్ తో పాటు థియేట్రికల్ ప్రదర్శనలు, కమ్యూనిటీ మార్కెట్‌లు, జానపద ప్రదర్శనలు, పిల్లల కోసం అనేక ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది.