విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) లక్ష్యమని ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన రాప్తాడు జడ్పీ హైస్కూల్, కురుగుంటలోని వెల్ఫేర్ స్కూల్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎంశ్రీతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, సాంకేతిక సొబగులద్దనున్నారని తెలిపారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, సంక్షేమం కోసం ఎన్నో పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయన్నారు. నాణ్యత మెరుగుపర్చడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. టీచర్లు పాఠ్యప్రణాళికతోపాటు, టీచింగ్ డైరీని తప్పనిసరిగా ఫాలో కావాలన్నారు. విద్యార్థులు నోట్‌బుక్స్ రాశారా లేదా పరిశీలించి సంతకాలు చేయలన్నారు. సమ్మెటివ్ పరీక్షల పత్రాలను దిద్ది మార్కులను రిజిస్టర్లలో వెంటనే నమోదుచేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ద్విభాషా పుస్తకాలు అందాయో లేదో చూడాలన్నారు. స్కూళ్లకు విద్యార్థులు వచ్చేటప్పుడు విద్యార్థులు షూ, బ్యాగులతో వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నాడు-నేడు ఫేజ్-1 కింద అందించిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, మెనూ మేరకు జగనన్న గోరుముద్ద పిల్లలకు అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవంటూ టీచర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంఓ హరికృష్ణ, ఎంఈఓ వెంకటస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.