సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆమె ఇక్కడి విలేకర్లతో మాట్లాడారు. పండగను అంతా ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్నారు. జూదం, కోడి పందాలు వంటి వాటి జోలికెళ్లి ధనాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందాలు, పేకాట, లాటరీ బల్లలు వంటివి నిర్వహించేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి వారిపట్ల పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అంతేకాకుండా గతంలో జూదానికి పాల్పడుతూ పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి ముందస్తు బైండోవర్ చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఇదిలావుంటే, పండగలకు సొంత ఊళ్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విలువైన సామగ్రితో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.