ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ అంశం హాట్ టాపిక్ గా మారింది. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా దుమ్ము రేపుతోంది. ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలు మారుమోగుతున్నాయి. ఈ సమయంలో.. ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బాలకృష్ణ ఫొటోతో పాటు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటో ఉంది. దీన్ని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఈ ఫ్లెక్సీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఆయన పార్టీ మారొచ్చనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలోని ఓ వర్గం నాయకులతో కేపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్‌కి మద్దతుగా కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగలేదు. కొంమంది చీడ పీడల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే చుట్టూ పది మంది పోరంబోకుల్ని ఉంచుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆయన తండ్రి టీడీపీ ఎంపీని కలిశారు. దీంతో పార్టీ మారొచ్చని ఊహాగాణాలు బలంగా వినిపించాయి. తాజాగా ఈ ఫ్లెక్సీ కలకలం రేపింది.