అన్ని రోజుల్లోనూ విశాఖ సిటీ అందంగా ఉండేలా తగిన కార్యాచరణ రూపొందించాలని అధికార్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విశాఖ బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. విశాఖపట్నంలో జరగనున్న జీ20 సన్నాహక సదస్సు కోసం జరగుతున్న ఏర్పాట్లపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కొక్క జీ 20 సభ్య దేశం నుంచి ఆరుగురు చొప్పున హాజరవుతారని.. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరుకానున్నారని.. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు వస్తారని సీఎం జగన్ తెలిపారు. మార్చి 28, 29 తేదీల మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఈ ఒక్క సమావేశం సందర్భంగానే కాకుండా, అన్ని రోజుల్లోనూ విశాఖ సిటీ అందంగా ఉండేలా తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
జీ 20 సదస్సుకు ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఈ సదస్సు ఏర్పాట్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.. అయితే, ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్‌కు తెలిపారు.
సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం జగన్ సూచించారు.