ప్రజా సమస్యలు గాలికొదిలి పదవిని శాశ్వతం చేసుకునే పనిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మునిగితేలుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) స్వర్ణోత్సవ మహాసభలు గురువారం విజయవాడ ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో జరిగాయి. మహాసభలకు ఎస్ జ్యోతిబాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.... ధరలు, పన్నుల భారాలు పెంచుతూ మున్సిపల్ కార్మికులు వేతనాలు మాత్రం పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలని, 30 ఏళ్లు పదవిలో కొనసాగాలనే భ్రమలో ఉన్న సీఎం ఓటు వేసి గెలిపించిన కార్మికులను గాలికొదిలారన్నారు. సీఐటీయూ నాయకులు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.... కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారీ ఉద్యమం చేస్తామన్నారు. ఎన్సీహెచ్ శ్రీనివాస్, బోయి సత్యబాబు, డేవిడ్ పాల్గొన్నారు.