రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోరుతూ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 4 వరకు చేపట్టనున్న ‘సమర యాత్ర’ను జయప్రదం చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి, యువజన, విద్యార్ధి సంఘాల నేతలు కోరారు. విజయవాడ , గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో యాత్ర వాల్ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ, సీపీఎం రాష్ట్రకార్యవర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగమనేని శివరాం ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వి.గురునాథం మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. యువజన విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగుతుందన్నారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అర్జీలిస్తూ వాటిని మీడియాకు చెబుతున్నారే గానీ తీసుకున్న కేంద్రం పెద్దలు ఏం చెప్పారో బయటకు చెప్పడం లేదని విమర్శించారు. యువకులు, విద్యార్థులు రోడ్లపైకి ఉద్యమించాలని అప్పడే పాలకులు దిగి వస్తారన్నారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్లు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సమర యాత్రకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐవైఎఫ్, పీడీఎ్‌సయూ, ఏఐఎ్‌సఎఫ్, ఎన్‌ఎ్‌సయూఐ నేతలు రామన్న, ప్రసన్న, రాజేంద్ర, రవిచంద్ర, కె.శివారెడ్డి, వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమర యాత్ర 1800 కి.మీ జరుగుతుందన్నారు. ఆప్ నేత వీర ప్రసాద్ పాల్గొన్నారు.