గన్నవరం, స్థానిక కోనాయి చెరువు వద్ద చెత్త డంపింగ్ చేయవద్దంటూ స్థానికులు చెత్త రిక్షాలను, ట్రాక్టర్లను గురువారం అడ్డుకున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను చెరువు సమీపంలో వేయటం వల్ల దుర్వాసన వెదజల్లుతోందన్నారు. చెత్తకు నిప్పు పెట్టడంతో వచ్చే పొగతో ఊపిరాడటం లేదని, ఉక్కిరిబిక్కిరి అవుతున్నామన్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో చెత్త సమస్య మరింత జఠిలమవుతుందన్నారు. పట్టణంలో 21 వార్డులుండగా రోజుకి సుమారు 15 ట్రాక్టర్ల చెత్త వస్తోందన్నారు. రిక్షాలను, ట్రాక్టర్‌లను అడ్డుకోవటంతో పంచాయతీ కార్యదర్శి బాపూజీకి కార్మికులు సమాచారం ఇచ్చారు. ఆయన వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు అంగీకరించకపోవటంతో తహసీల్దారు నరసింహారావు గొల్లనపల్లిలో చెత్త వేసేందుకు పరిశీలన చేసి వచ్చారు. వారంలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు ఉపసర్పంచ్ పాలడుగు నాని మద్దతు తెలపగా జాస్తి ఫణిశేఖర్, కాసరనేని రంగబాబు, కొణసాని నాగేశ్వరరావు, చిలకపాటి సుబ్బారావు, గోపాలరావు, కాట్రగడ్డ శేషు, బొర్రా శ్రీను పాల్గొన్నారు.