జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీని వీడిన పరిశ్రమల జాబితా కొండవీటి చాంతాండంత.. కొత్తగా వచ్చినవి సూది మొనంత అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ దృష్టిలో పరిశ్రమలంటే.. టీ కొట్లు, కిళ్లీ షాపులు, మాంసం దుకాణాలు, జిరాక్స్ సెంటర్లేనని అన్నారు. డీపీఐఐటీ పేరుతో జగన్ హయాంలో రాష్ట్రానికి.. రూ.15,693 కోట్లు పెట్టుబడులు వచ్చాయంటున్నారని, డీపీఐఐటీ నివేదికలో చెబుతున్న పరిశ్రమలన్నీ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకున్నవేనని జీవీ రెడ్డి అన్నారు. గ్రీన్కో సోలార్, ఇసుజిమోటార్స్, రుచిసోయా, సెంబ్ కార్ప్ సంస్థలను.. ఏపీకి తీసుకొచ్చినట్లు జగన్ నిరూపించగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.11,944 కోట్లే వచ్చాయన్నారు.. జగన్ ముఖం చూసి వచ్చిన పరిశ్రమలు ఎక్కడున్నాయో చూపాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో రూ.39,450 కోట్ల పెట్టబడులొస్తే.. 5,13,000 ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలన్నీ.. సాక్షి ప్రకటనల్లో, సీఎం దొంగలెక్కలో మాత్రమే కనిపిస్తాయని జీవీ రెడ్డి అన్నారు.