దేవదాయశాఖలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సదరు ఉద్యోగి ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలోనూ వెంబడించి మరీ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని ఆమె అనేకసార్లు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని సామజిక మాధ్యమాలు వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించారు. విచారణ చేపట్టి.. ఆ వ్యక్తి మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు తాత్కాలికంగా నిర్థారణకు వచ్చి.. పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకూ వేధింపులకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ గురువారం ఆదేశాలిచ్చారు.