పర్చూరు నియోజకవర్గం కారంచేడుకు చెందిన మాజీ మంత్రి, ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను, తన కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు చేసిన ప్రకటనపై ట్రోల్స్ మొదలయ్యాయి. డాక్టర్ దగ్గుబాటి భార్య, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండగా ఆమెతో తన కుటుంబానికి సంబంధం లేనట్లు డాక్టర్ దగ్గుబాటి తాను తన కుమారుడు మాత్రమే రాజకీయాలను తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సమంజసంగా లేదనే వాదన వినవస్తోంది. అదే సమయంలో ఆయన కుమారుడు హితేష్ కూడా ఏ రోజూ రాజకీయాల్లో చురుగ్గా లేరు. అలాంటిది కుమారుడిని తనతో కలుపుకొని పొలిటికల్ స్టార్ గా వెలుగుతున్న భార్య ప్రస్తావన లేకుండా డాక్టర్ దగ్గుబాటి ఈ తరహా ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2019 ఎన్నికల సందర్భంగా కూడా దగ్గుబాటి తానేమో పర్చూరు నుండి వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేయగా ఆయన భార్య పురంధరేశ్వరి నరసరావుపేట నుండి లోక్‌సభ కు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. ఆ తదుపరి వైసిపి అధిష్టానం భర్త ఒక పార్టీలో, భార్య ఒక పార్టీలో ఉండడం సముచితం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పటినుంచి ఆయన ఇన్ యాక్టివ్ అయ్యారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి పురందరేశ్వరికి రాజ్యసభ సీటు ఇచ్చే యోచనలో బిజెపి అధిష్టాన వర్గం ఉండగా, ఆమెకు మార్గం సుగమం చేసేందుకు దగ్గుబాటి వ్యూహాత్మకంగా తన రాజకీయ సన్యాసం ప్రకటన చేసినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇది మరో పవర్ గేమ్ అని వారు విశ్లేషిస్తున్నారు. పురందేరశ్వరిని కేంద్ర మంత్రిని చేసి కాంగ్రెస్ అధిష్టానం గౌరవిస్తే ఆమె 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బిజెపిలో చేరిపోవటం, అదే ఎన్నికలలో పరుచూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుబాటి అసలు పోటీ చేయకపోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.