విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఏ. ఆర్ అదనపు ఎస్. పి ఎస్. ఎస్. ఎస్. వి కృష్ణారావు ఏ. ఆర్ పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు రెండు వారాల పాటు నిర్వహించే " మొబలైజేషన్ " కార్యక్రమాన్ని కడప జిల్లా ఎస్. పి అన్బురాజన ఆదేశాల మేరకు ఆయన బుధవారం కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏ. ఆర్ అదనపు ఎస్. పి ఎస్. ఎస్. ఎస్. వి కృష్ణారావు మాట్లాడుతూ పోలీసులు చేసే ప్రతీ పనిలోనూ ఎంతో నేర్పరితనం, సమయస్ఫూర్తి, నైపుణ్యంతో కూడుకుని ఉంటాయన్నారు. ఇతర ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం భిన్నంగా ఉంటుంది. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలు ఏమాత్రం సడలకుండా క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుందన్నారు.
ఏ. ఆర్ సిబ్బందికి ప్రతీ ఏటా మొబలైజేషన్ కార్యక్రమం నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంతేకాకుండా ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.
తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలిచ్చే విధంగా సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బి. డి టీం, ప్రిజనర్స్ ఎస్కార్ట్, పి. ఎస్. ఒ లు, డ్రైవర్స్ , తదితర సిబ్బంది బాగా మెరుగుపరుచుకోవాలన్నారు. ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాబ్ కంట్రోల్ , ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా తర్ఫీదునిస్తారన్నారు. ఇదే సమయంలో మొబలైజేషన్ కు వచ్చిన సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. ఏ. ఆర్ డి. ఎస్. పి బి. రమణయ్య, ఆర్. ఐ లు వీరేష్, సోమశేఖర్ నాయక్, ఆర్. ఎస్. ఐ లు, ఏ. ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.