తెలుగుదేశం పార్టీలో మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు తో పాటు న్యాయవాది కొమ్మారెడ్డి వీరరాఘవరెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నూతలపాటి నంబూద్రిపాద్, తిరువీధుల నరసింహమూర్తి చేరిన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నమ్మి తెలుగుదేశం పార్టీని ప్రారంభించానన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన మహానేత ఎన్టీఆర్ తెలుగు జాతికే కీర్తి కిరీటం అని తెలిపారు. తాత ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఆయనకు చెడ్డపేరు మాత్రం తీసుకురానని లోకేశ్ అన్నారు.